ఏపీ వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్
AP Ward Secretariat Employees Promotions 815 Junior Assistant Posts : ఏపీ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ఏర్పాటు, వార్డు సచివాలయ సిబ్బందికి పదోన్నతులు, పోస్టుల అప్గ్రేడేషన్పై కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్లోని వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత ఉన్న సిబ్బందికి పదోన్నతులు కల్పించే ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ G.O.MS.No.244 ఉత్తర్వులు జారీ చేసింది.

వార్డు సచివాలయ సిబ్బందికి ప్రమోషన్ ఛానల్ను సులభతరం చేయడంలో భాగంగా ప్రభుత్వం కొత్త పోస్టులను ఏర్పాటు చేసింది. మిగులు పోస్టులను సర్దుబాటు చేయడం ద్వారా మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను కొత్తగా ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చింది.
ఈ పోస్టుల్లో అర్హత కలిగిన వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు పదోన్నతులు కల్పించనున్నారు. దీంతో చాలాకాలంగా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.
వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల పదోన్నతుల తర్వాత, అర్హత ఉన్న వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు కూడా తదుపరి స్థాయిలో ప్రమోషన్లు కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరిని వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలుగా పదోన్నతి కల్పించనున్నారు.
అదే సమయంలో 815 వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ గ్రేడ్-II పోస్టులను గ్రేడ్-Iగా అప్గ్రేడ్ చేశారు. అలాగే 815 వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ గ్రేడ్-II పోస్టులను కూడా గ్రేడ్-I స్థాయికి పెంచారు. మొత్తంగా వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లకు మార్గం సుగమం చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కొత్త పోస్టుల ఏర్పాటు, ఉన్న పోస్టుల అప్గ్రేడేషన్ ద్వారా సిబ్బందికి కెరీర్లో ముందుకు వెళ్లే అవకాశం కల్పించింది.
ఈ పోస్టుల పునర్వ్యవస్థీకరణ వల్ల ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో అర్హత ఉన్న వార్డు సచివాలయ ఉద్యోగుల్లో పదోన్నతులపై ఆశలు పెరిగాయి.


