రేషన్ సరఫరాలో కొత్త డిజిటల్ వోచర్ విధానం QR కోడ్‌తో ఇక నేరుగా సరుకులు
Ration Digital Voucher QR Code New System : రేషన్ సరఫరా వ్యవస్థలో మరో ముఖ్యమైన మార్పు రానుంది. ఉచిత బియ్యం, గోధుమలు వంటి ఆహార ధాన్యాలు లబ్ధిదారులకు చేరే విధానంలో కేంద్రం డిజిటల్ విధానాలపై దృష్టి పెట్టింది.
ఇప్పటికే ఆధార్ అనుసంధానం, ఈపీఓఎస్ మెషీన్లు, వన్ నేషన్ వన్ రేషన్ కార్డు వంటివి అమలులో ఉన్నాయి. ఇప్పుడు అందులోనే డిజిటల్ వోచర్ సిస్టమ్‌ను కూడా చేర్చాలని ఆలోచిస్తున్నారు. దీని ద్వారా లబ్ధిదారులకు ప్రత్యేక వోచర్ జారీ చేసి, దాన్ని QR కోడ్ లేదా ఎస్ఎంఎస్ రూపంలో ఇస్తారు. ఈ వోచర్‌ను చూపించి రేషన్ దుకాణంలో సరుకులు తీసుకోవచ్చు.

ఈ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం సరుకులు మధ్యలో పక్కదారి పట్టకుండా చూడటం, పంపిణీలో పారదర్శకత పెంచడం. జనవరి 2026లో ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఎన్పీసీఐ ఈ-రూపీ ప్లాట్‌ఫామ్‌ను పీడీఎస్ సిస్టమ్‌తో కలపడానికి పని చేసింది.
విధానం ఇలా పనిచేస్తుంది: లబ్ధిదారుల వివరాలు ఎస్బీఐకి వెళ్తాయి. ఎస్బీఐ, ఎన్పీసీఐ ఈ-రూపీ ప్లాట్‌ఫామ్‌తో కలిసి ఆధార్‌తో లింక్ అయిన ప్రత్యేక వోచర్ తయారు చేస్తాయి. ఆ వోచర్ లబ్ధిదారుడి మొబైల్‌కు QR కోడ్ రూపంలో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు మేరా రేషన్ యాప్ ద్వారా కూడా దీన్ని చూసుకోవచ్చు.
ప్రయోగాత్మకంగా ముందు కొన్ని చోట్ల అమలు చేసి, ఆ తర్వాత విస్తరించే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై అధికారిక మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉంది.
ఈ మార్పు వల్ల లబ్ధిదారులకు సరుకులు సులభంగా అందుతాయని, అదే సమయంలో దుర్వినియోగం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.


