AP Police Constables :కానిస్టేబుళ్లకు శుభవార్త.. స్టైపెండ్ రూ.12,500కు పెంపు
AP Police Constables Stipend Hike 12500 : ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుళ్లకు ప్రభుత్వం కీలక శుభవార్త తెలిపింది. శిక్షణలో ఉన్న స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు ప్రస్తుతం అందుతున్న స్టైపెండ్‌ను రూ.4,500 నుంచి రూ.12,500కు పెంచినట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.

ఏపీఎస్పీ 6వ బెటాలియన్ బీటీసీ పరేడ్ గ్రౌండ్స్‌లో 2025–26 బ్యాచ్‌కు చెందిన 149 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరై, శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది ప్రజల్లో భయాన్ని కాకుండా భరోసాను కల్పించేలా పనిచేయాలని సూచించారు. విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం ఎంతో ముఖ్యమని చెప్పారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను ఓపికగా విని, వారికి తగిన సహాయం అందించాలని సూచించారు. ప్రస్తుతం నేరాల తీరు మారుతున్న నేపథ్యంలో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని అనిత తెలిపారు. ముఖ్యంగా సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు సాంకేతిక నైపుణ్యాలు కలిగిన సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించినట్లు చెప్పారు.
రాష్ట్రంలో సుమారు 6 వేల కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియను పూర్తి చేసినట్లు హోంమంత్రి తెలిపారు. ఈ నియామక ప్రక్రియలో పలు అడ్డంకులు ఎదురైనా విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 21 పోలీస్ శిక్షణ కేంద్రాల్లో 5,800 మంది కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తి చేసుకున్నారని అధికారులు తెలిపారు. వీరిలో 2,330 మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు ఉన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో సుమారు 1,000 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉండటం విశేషం.
పోలీస్ శాఖలో కానిస్టేబుళ్లు కీలక పాత్ర పోషిస్తారని హోంమంత్రి పేర్కొన్నారు. విపత్తులు, బందోబస్తు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో సమర్థంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేయాలని సూచించారు.


