AP Pensioners: ఏపీ పెన్షనర్లకు శుభవార్త.. అదనపు పింఛన్ పెంపు, కొత్త రేట్లు ఇవే
AP Pensioners Additional Pension Increase 2026 : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పెన్షనర్లకు అదనపు పింఛన్‌కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వయసు ఆధారంగా అందించే అదనపు పింఛన్ రేట్లను పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఈ మేరకు G.O.Ms.No.126 ద్వారా అదనపు పింఛన్ రేట్లను పునరుద్ధరించారు. ఇకపై 70 ఏళ్లు పూర్తయిన పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు అదనపు పింఛన్‌ను ప్రాథమిక పింఛన్లో 10 శాతంగా అందించనున్నారు. ఇప్పటివరకు ఉన్న 7 శాతం నుంచి ఇది 10 శాతానికి పెరిగింది.
అదేవిధంగా 75 ఏళ్లు పూర్తయిన వారికి అదనపు పింఛన్‌ను 12 శాతం నుంచి 15 శాతానికి పెంచారు. అంటే ఈ వయసు దాటిన పెన్షనర్లు గతంతో పోలిస్తే అదనంగా 3 శాతం ప్రయోజనం పొందనున్నారు. ఈ పెంచిన అదనపు పింఛన్ డిసెంబర్ 2026 నెల పింఛన్‌కు వర్తించనుంది. పెరిగిన మొత్తాన్ని 2027 జనవరి 1 నుంచి చెల్లించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయితే 80 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న పెన్షనర్లకు ప్రస్తుతం అమల్లో ఉన్న అదనపు పింఛన్ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. మార్పులు ప్రధానంగా 70–75, 75–80 ఏళ్ల వయసు విభాగాలకు సంబంధించినవే.
పెన్షనర్ల సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో 70, 75 ఏళ్లు పూర్తయిన రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు అదనపు ఆర్థిక ప్రయోజనం అందనుంది.

