ఏపీలో కొత్త పెన్షన్లకు దరఖాస్తులు.. 1.42 లక్షల మంది అనర్హులు
AP New Pensions Applications Ineligible Beneficiaries : ఏపీలో కొత్త పెన్షన్ల కోసం 13.65 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఆరు దశల పరిశీలనలో 1.42 లక్షల మందిని అనర్హులుగా గుర్తించారు. పూర్తి వివరాలు ఇవే.
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పెన్షన్ పొందేందుకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం మొత్తం 13.65 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వీటిలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, చేనేత, మత్స్యకారుల కేటగిరీలకు సుమారు 10.30 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఆరు దశల్లో పరిశీలన : కొత్త పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం ఆరు దశల్లో పరిశీలించింది. అర్హతలు, అందించిన వివరాలు, సంబంధిత రికార్డులను పరిశీలించిన అనంతరం ప్రస్తుతం ఈ ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ పరిశీలనలో సుమారు 1.42 లక్షల మంది దరఖాస్తుదారులు అనర్హులుగా గుర్తించినట్లు సమాచారం. అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన వారికి మాత్రమే కొత్త పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉంది.
పెన్షన్లపై భారీ వ్యయం : వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, చేనేత, మత్స్యకారుల కేటగిరీల్లో అర్హత పొందిన వారికి పెన్షన్లు మంజూరు చేస్తే ప్రభుత్వంపై గణనీయమైన ఆర్థిక భారం పడనుంది. ఈ ఐదు కేటగిరీలకు కలిపి ఏడాదికి సుమారు రూ.4,300 కోట్లకు పైగా వ్యయం అయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా.
అనంతపురంలో అత్యధిక దరఖాస్తులు : జిల్లాల వారీగా చూస్తే అనంతపురం జిల్లాలో అత్యధికంగా సుమారు 67 వేల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. దరఖాస్తుల పరిశీలన పూర్తైన నేపథ్యంలో అర్హులైన వారికి తదుపరి దశలో పెన్షన్ మంజూరు ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు తమ దరఖాస్తు స్థితి, అర్హతకు సంబంధించిన వివరాలను అధికారికంగా అందుబాటులోకి వచ్చే సమాచారాన్ని బట్టి తెలుసుకోవచ్చు.


