Indiramma Houses: అసంపూర్తి ఇళ్లకు రూ.2-3 లక్షలు.. 1.80 లక్షల ఇళ్లకు 15 రోజుల్లో బిల్లులు
Telangana Indiramma Houses Pending Bills 2 3 Lakh Assistance : తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కీలక అప్డేట్. నిర్మాణం పూర్తయిన 1.80 లక్షల ఇళ్లకు 15 రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. అసంపూర్తి ఇళ్లకు రూ.2-3 లక్షల సాయం అంశం కూడా వెల్లడించారు.
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను త్వరగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జనగామ జిల్లా పర్యటనలో మంత్రి మాట్లాడుతూ.. నిర్మాణం పూర్తయిన సుమారు 1.80 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు 15 రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని వెల్లడించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెల్లింపులు పూర్తి చేస్తామని చెప్పారు.

ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లో లంచాలకు తావు లేకుండా నేరుగా ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. ప్రతి సోమవారం బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు. లబ్ధిదారులు ఎవరి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చెల్లింపులు జరిగేలా చూస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనా మంత్రి ప్రస్తావించారు. ఒక్కో ఇంటికి కేంద్రం నుంచి రూ.72 వేల సాయం వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరిన తర్వాత ఇటీవల 2 లక్షల ఇళ్లకు కేంద్రం మంజూరు ఇచ్చిందని తెలిపారు.
ఇక గతంలో వివిధ కారణాలతో మధ్యలోనే ఆగిపోయిన ఇళ్లకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. నిర్మాణం ఏ దశలో ఆగిపోయిందన్న దాని ఆధారంగా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు సాయం అందించే విధానం గురించి మంత్రి గతంలో వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న ఇళ్లను కూడా పూర్తి చేయడంపై దృష్టి పెట్టింది. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లలో అసంపూర్తిగా మిగిలిన ఇళ్లకు ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి ఇప్పటికే తెలిపారు.
అందువల్ల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణం ఏ దశలో ఉందో, బిల్లుల ప్రక్రియ పూర్తయిందా లేదా అనే విషయాన్ని సంబంధిత అధికారుల ద్వారా తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


