PM Kisan Maandhan Yojana 2026: రైతులకు నెలకు రూ.3,000 పెన్షన్.. అర్హతలు, దరఖాస్తు పూర్తి వివరాలు
PM Kisan Maandhan Yojana 3000 Pension Details : చిన్న, సన్నకారు రైతులకు PM-KMY పథకం ద్వారా 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ పొందే అవకాశం. అర్హతలు, చందా, కావాల్సిన పత్రాలు, దరఖాస్తు విధానం తెలుసుకోండి.
వ్యవసాయంపై ఆధారపడి జీవించే చిన్న, సన్నకారు రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన (PM-KMY) ను అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులు తమ వయసును బట్టి ప్రతి నెలా కొంత మొత్తాన్ని పెన్షన్ నిధికి చెల్లిస్తే, కేంద్ర ప్రభుత్వం కూడా వారి తరఫున సమాన మొత్తాన్ని జమ చేస్తుంది. ఇలా నిర్దిష్ట కాలం పాటు విరాళాలు చెల్లించిన రైతులకు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు కనీసం రూ.3,000 పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.

PM-KMY పథకం అంటే ఏమిటి?
రైతులు వృద్ధాప్యంలో వ్యవసాయ పనులు చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు వారి జీవనానికి కొంత ఆర్థిక తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చారు. ఇది స్వచ్ఛందంగా చేరే, చందాలు చెల్లించాల్సిన పెన్షన్ పథకం. అంటే అర్హత ఉన్న ప్రతి రైతుకు ఆటోమేటిక్‌గా పెన్షన్ ప్రారంభం కాదు. ముందుగా పథకంలో నమోదు చేసుకుని, నిబంధనల ప్రకారం నిర్ణీత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
నెలకు రూ.3,000 పెన్షన్ ఎలా పొందవచ్చు?
ఈ పథకంలో చేరిన రైతులు 60 ఏళ్ల వయసు వచ్చే వరకు తమ వయసుకు అనుగుణంగా నెలవారీ చందా చెల్లించాలి. రైతు చెల్లించే మొత్తానికి సమానమైన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా పెన్షన్ నిధికి జమ చేస్తుంది. అర్హత నిబంధనలు, చందాల చెల్లింపు షరతులు పూర్తిచేసిన తర్వాత 60 ఏళ్లు నిండిన రైతుకు ప్రతి నెలా కనీసం రూ.3,000 పెన్షన్ అందుతుంది. ఈ విధానం ద్వారా రైతులు తమ వృద్ధాప్య అవసరాల కోసం ముందుగానే కొంత మొత్తాన్ని క్రమం తప్పకుండా పొదుపు చేసినట్లవుతుంది. అయితే ఇది వెంటనే డబ్బులు అందించే పథకం కాదు. పెన్షన్ పొందాలంటే నిర్ణీత వయసు వరకు పథకంలో కొనసాగడం ముఖ్యం.
పథకానికి ఎవరు అర్హులు? ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజనలో చేరాలనుకునే రైతులు కొన్ని ముఖ్యమైన అర్హతలను కలిగి ఉండాలి. సాధారణంగా 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్న చిన్న, సన్నకారు రైతులు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. రైతు కుటుంబానికి సంబంధించిన సాగుభూమి 2 హెక్టార్ల వరకు ఉండాలి.
నెలకు ఎంత చందా చెల్లించాలి : ఈ పథకంలో రైతు చేరే వయసును బట్టి నెలవారీ చందా నిర్ణయిస్తారు. చిన్న వయసులో చేరేవారు తక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉండగా, ఎక్కువ వయసులో చేరేవారికి నెలవారీ చందా కొంత ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, 18 ఏళ్ల వయసులో పథకంలో చేరే రైతుకు నెలకు సుమారు రూ.55 చందా ఉంటుంది. 40 ఏళ్ల వయసులో చేరేవారికి నెలవారీ చందా సుమారు రూ.200 వరకు ఉండవచ్చు. ఈ మొత్తానికి సమానమైన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా జమ చేస్తుంది.
దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు PM-KMY పథకంలో నమోదు చేసుకోవాలనుకునే రైతులు తమ గుర్తింపు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు వివరాలు, భూమికి సంబంధించిన సమాచారం సిద్ధంగా ఉంచుకోవాలి. సాధారణంగా ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు లేదా బ్యాంకు పాస్‌బుక్, భూమి పత్రాలు, ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్ అవసరం కావచ్చు.
PM-KMY పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి? ఈ పథకంలో చేరేందుకు రైతులు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా మీ సేవను సంప్రదించవచ్చు. అక్కడ తమ ఆధార్, బ్యాంకు వివరాలు, భూమికి సంబంధించిన పత్రాలను అందించి నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. నమోదు సమయంలో వయసుకు అనుగుణంగా చెల్లించాల్సిన చందా వివరాలను తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో వివరాలు తెలుసుకోవాలనుకునే వారు అధికారిక మాన్‌ధన్ https://maandhan.in/వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

🛑అధికారిక వెబ్‌సైట్ క్లిక్ హియర్

