Aadhaar Website : ఆధార్ వెబ్సైట్ పూర్తిగా మారిపోయింది.. కొత్త ఫీచర్లు ఇవే
Aadhaar Website New Features Online Services 2026: ఆధార్ కార్డు వినియోగదారులకు ముఖ్యమైన అప్డేట్. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తన అధికారిక వెబ్సైట్ను కొత్త రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధార్కు సంబంధించిన సమాచారం, ఆన్లైన్ సేవలను మరింత సులభంగా పొందేలా వెబ్సైట్ను రీడిజైన్ చేశారు.
కొత్త వెబ్సైట్లో ఆధార్ గురించి సమాచారం తెలుసుకోవడం, అవసరమైన సేవను ఎంచుకోవడం, డాక్యుమెంట్లను వెతకడం, సహాయం పొందడం వంటి పనులు సులభంగా ఉండేలా మార్పులు చేశారు. UIDAI వెబ్సైట్, myAadhaar పోర్టల్, Aadhaar యాప్లకు ఒకే రకమైన విజువల్ గుర్తింపు కనిపించేలా డిజైన్ చేశారు.

కొత్త వెబ్సైట్లో యాక్సెసిబిలిటీకి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. స్క్రీన్ రీడర్ సపోర్ట్, ఫాంట్ సైజ్ మార్చుకునే అవకాశం, మెరుగైన కలర్ కాంట్రాస్ట్, కీబోర్డ్ ద్వారా నావిగేషన్ వంటి సదుపాయాలు ఉన్నాయి. దీంతో వివిధ అవసరాలు ఉన్నవారు కూడా వెబ్సైట్ను సులభంగా ఉపయోగించుకోవచ్చు.
భాషల పరంగా కూడా వెబ్సైట్లో మార్పులు చేశారు. Bhashini ఇంటిగ్రేషన్తో ప్రస్తుతం ఇంగ్లిష్, హిందీతో పాటు మొత్తం 13 భాషల్లో సేవలు అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో ఈ సంఖ్యను 23 భాషలకు పెంచే ప్రణాళిక ఉన్నట్లు UIDAI తెలిపింది. కొత్త వెబ్సైట్ ద్వారా ఈ-ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ ఎన్రోల్మెంట్ లేదా అప్డేట్ రిక్వెస్ట్ స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు. అలాగే మాస్క్డ్ ఆధార్ను కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది.
ఆధార్లో అడ్రస్ వంటి కొన్ని వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు. అయితే ఫింగర్ప్రింట్, ఐరిస్ లేదా ఫొటో వంటి బయోమెట్రిక్ వివరాలను మార్చుకోవాలంటే ఆధార్ సేవా కేంద్రం లేదా అధీకృత ఎన్రోల్మెంట్ సెంటర్ను సందర్శించాల్సి ఉంటుంది.
మాస్క్డ్ ఆధార్లో పూర్తి ఆధార్ నంబర్ కనిపించదు. చివరి నాలుగు అంకెలు మాత్రమే చూపిస్తారు. అవసరమైన సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఆధార్ PVC కార్డును కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునే సదుపాయం ఉంది. ఇది సాధారణ పేపర్ కాపీ కంటే సులభంగా వెంట తీసుకెళ్లేందుకు అనుకూలంగా ఉంటుంది.
కొత్త వెబ్సైట్లో ఆధార్ సేవా కేంద్రం కోసం సెర్చ్ చేయడం, అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం, వివిధ రిక్వెస్టుల స్టేటస్ తెలుసుకోవడం వంటి సదుపాయాలు ఉన్నాయి. అలాగే ఆధార్ వెరిఫికేషన్, ఫిర్యాదు నమోదు వంటి సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.
మొత్తంగా చూస్తే, UIDAI కొత్త వెబ్సైట్ ద్వారా ఆధార్కు సంబంధించిన అనేక సేవలను ఒకే చోట అందుబాటులోకి తీసుకొచ్చింది. అవసరమైన పనులు ఆన్లైన్లోనే పూర్తయ్యే అవకాశం ఉండటంతో ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిన సందర్భాలు కొంతవరకు తగ్గనున్నాయి.


