రైల్వేలో TC ఉద్యోగాల నోటిఫికేషన్ : 3,477 పోస్టులకు రైల్వే షార్ట్ నోటిఫికేషన్.. అక్టోబర్ 8 నుంచి దరఖాస్తులు | RRB NTPC Recruitment 2026
RRB NTPC Graduate Level Recruitment 2026 3477 Posts Application Date : రైల్వేలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) NTPC గ్రాడ్యుయేట్ లెవల్ రిక్రూట్‌మెంట్-2026కు సంబంధించి 3,477 ఖాళీలతో షార్ట్ నోటీస్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ CEN 06/2026 కింద జరగనుంది.
3,477 ఉద్యోగాలు.. ఏ పోస్టులు ఉన్నాయి : ఈ రిక్రూట్‌మెంట్‌లో మొత్తం 3,477 గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఒక్క విభాగంలోనే 2,750 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు 371, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు 300, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్టులు 56 ఉన్నాయి. ఈ నాలుగు పోస్టులను కలిపితే మొత్తం 3,477 ఖాళీలు అవుతున్నాయి.

అక్టోబర్ 7న పూర్తి నోటిఫికేషన్ : RRB విడుదల చేయనున్న వివరణాత్మక నోటిఫికేషన్‌లో పోస్టుల వారీగా అర్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్, పరీక్ష విధానం, ఫీజు, జోన్‌ల వారీగా ఖాళీలు, ఇతర ముఖ్యమైన నిబంధనలను పూర్తిగా వెల్లడించనున్నారు. తాజా షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 7, 2026న డిటైల్డ్ నోటిఫికేషన్ అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 8 నుంచి దరఖాస్తులు అభ్యర్థులు అక్టోబర్ 8, 2026 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తు ప్రక్రియ RRB అధికారిక అప్లికేషన్ పోర్టల్ ద్వారా కొనసాగుతుంది.
డిగ్రీ అర్హతతో అవకాశం : NTPC గ్రాడ్యుయేట్ లెవల్ పోస్టులకు ప్రధాన విద్యార్హతగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అయితే పోస్టును బట్టి అదనపు అర్హతలు లేదా టైపింగ్ వంటి నైపుణ్య పరీక్షలు ఉండే అవకాశం ఉంది. తుది అర్హత ప్రమాణాలను పూర్తి నోటిఫికేషన్‌లో RRB స్పష్టంగా వెల్లడిస్తుంది.
ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది : RRB NTPC గ్రాడ్యుయేట్ పోస్టులకు సాధారణంగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలతో పాటు పోస్టును బట్టి టైపింగ్ లేదా ఇతర నైపుణ్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష వంటి దశలు ఉంటాయి. ఏ పోస్టుకు ఏ దశ వర్తిస్తుందనే పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో స్పష్టంగా తెలుస్తాయి.
అభ్యర్థులు ఏం చేయాలి : ప్రస్తుతం గ్రాడ్యుయేట్ అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ కోసం వేచి చూస్తూ, తమ విద్యార్హతలు మరియు ఇతర అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా దరఖాస్తు ప్రారంభమైన తర్వాత చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే అప్లై చేయడం మంచిది.

🛑Short Notification Pdf Click Here

